రెండవ అడుగు

నిజదేవుడు సిద్ధపరచిన మోక్షమార్గాన్ని విశ్వసించాలి [Blieve in the Salvation prepared by true God]

సృష్టికర్తయైన దేవుడు సహజసిద్ధంగా పరిశుద్ధుడు, న్యాయవంతుడు, మరియు ప్రేమాస్వరూపి. మానవకోటి అంతా తమ కార్యాలద్వారా, మాటలద్వారా, అంతేగాక తలంపులు/ఉద్దేశాలద్వారాకూడా దేవునికి వ్యతిరేకంగా పాపముచేసినవారే. అత్యంత పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎంత చిన్న పాపమైనా పెద్ద సమస్యే. మన పాపము (అంటే దేవునికి వ్యతిరిక్తమైనది) మనను పరిశుద్ధుడైన దేవునినుండి వేరుపరచింది. దేవుని న్యాయం మనపాపాలకు తగిన జరిమాన లేక శిక్షను నిర్ణయించింది. అది పరిశుద్దుడైన దేవునికి దూరంగా నరకాగ్నిలో నాశనమవడం.

లోకములో పాపరహితుడెవరూ లేరుగనుక అందరు నరకములో నాశనాన్ని శిక్షగా పొందబోతున్నారు. అయితే సృష్టికర్తయైన దేవుడు ప్రేమాస్వరూపి. ఈ కారణముచేత ఆయన అందరిని ప్రేమిస్తూ ఎవరు అంటే ఏపాపికూడా నరకములోకి ప్రవేశించడాన్ని ఇచ్చయించడు. అందునుబట్టి దేవుని ప్రేమ మానవులు తమ పాపాలకు పొందబోయే నరకశిక్షకు పరిష్కారాన్ని కనుగొని మానవులు ఆశిక్షలోనుండి తప్పించుకునే పరిష్కారమార్గాన్ని సిద్దపరచింది. ఇందుకుగాను దేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరుస్తూనే తన ప్రేమను ఋజువుపరచాడు. ఇందులో దేవుని న్యాయం, ప్రేమ, మరియు జ్ఙానం ద్యోతకమవుతున్నాయి.

దేవుడు సర్వశక్తిమంతుడు మరియు సార్వభౌముడు. దీని భావం ఆయన తన స్వభావానికి గుణలక్షణాలకుకూడా వ్యతిరేకంగా ప్రవర్తించగలడని కాదు. ఒక వేళ దేవుడు తన ప్రేమను బట్టి పాపులందరికి ఏజరిమానా లేక శిక్ష విధించకుండా ఒక్క మాటతో వారిని క్షమిస్తే తద్వారా ఆయన తన స్వభావలక్షణమైన న్యాయం/నీతికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. కనుక ఆయన అలా చేయడు చేయనేరడు. అలాచేయడమన్నది నిజదేవుని స్వభావానికే విరుద్ధమైనది.

మానవులందరి పాపాలకు దేవుని న్యాయం తగిన జరిమానను/శిక్షను నిర్దేశించించింది. దాని వెల ఊహలకందనిది. ఏ ఒక్క నరుడుగాని లేక నరుల సమూహముగాని ఆ వెలను తీర్చజాలదు. అందుకే దేవుడే ఊహాతీతమైన ఆ జరిమానను తన అపారమైన ప్రేమను బట్టి తానే భరించి దాని వెలను తాను చెల్లించాడు. ఈ విధానంలో నిజదేవుడు మానవాళికి పాపక్షమాపణను అందిస్తూ మోక్షమార్గాన్ని సిద్ధపరచాడు.

దేవుడే సిద్ధపరచిన మోక్షమార్గపు నెరవేర్పులో నరుల ప్రయత్నాలుగాని లేక పాలుపంపులుగాని లేవు. ఇది కేవలం దేవుని కార్యం. ఏనరుడు తన స్వనీతినిబట్టి లేక తన స్వంత మతనిష్టనుబట్టి పాపక్షమాపణను మోక్షాన్ని పొందజాలడు. అది దేవుని ఉచిత కృపావరము. కనుకనే ఏనరునికీ ఇందులో అతిశయించే ఆస్కారము లేదు!

దేవుడే తన నిత్య సంకల్పములో పథకరచన చేసి నిర్వర్తించి సిద్ధపరచిన క్షమాపణా పథకాన్ని విశ్వసించక దాన్ని తిరస్కరించిన వ్యక్తులందరు దేవుని క్షమాపణను అందుకోలేరు. అలాంటివారందరు తమ పాపాలన్నింటికి దేవుని న్యాబద్ధమైన జరిమాన/శిక్ష అన్నది రాబోవు తీర్పుదినాన నరకశిక్షద్వారా అందుకోబోతున్నారు. ప్రవక్త అయిన మూసా (మోషే) మరియు యితర ప్రవక్తల ద్వారా యివ్వబడిన దేవుని లేఖనాలలోని ధర్మం సూచిస్తున్న ప్రకారం ఒక వ్యక్తి తన తోటి నరునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు లేక అన్యాయాలకు రెండంతలు చెల్లించాలి (నిర్గ.కాం.22:4,7,9; యెషయా.40:2, 51:19; యిర్మీయ.16:18). అయితే, ఒక వ్యక్తి సృష్టికర్తకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు/అన్యాయాలకు ఎన్ని రెట్లు చెల్లించాలో నన్నది ఊహకు అందనిది. కనుకనే ప్రవక్త అయిన దావూద్ (దావీదు) ద్వారా యివ్వబడిన దైవలేఖనాలలోని వివరణ ప్రకారం అది ఎన్నటికీ తీరనిది (కీర్తన.49:9).

“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.” (రోమా.5:8-9)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మూడవ అడుగు…