Monthly Archives: June 2019

జన్నతుకు నాలుగు అడుగులు

ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే. మరణం అన్నది అందరు తప్పనిసరిగా పొందబోయే ఈలోకములోని చివరి అనుభవం. అయితే, మరణముతరువాతి జీవితముకొరకు ఏకొద్దిమందో సిద్ధపడటము జరుగుతుంది. ‘చావు అనేది నాకు ఇప్పుడే రాదు’ లేక ‘చావు గురించి నేను యిప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు’ అన్న దృక్ఫథంతో ప్రతివ్యక్తీ జీవిస్తూ వుండటం సహజం.

రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి. ఈ లోకంలోని జీవితకాలాన్ని మరణంతరువాత గడుపబోయే కాలంతో పోలిస్తే అది లేశమాత్రమే నన్నది మరచిపోకూడదు.

ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలు ఘోషిస్తున్నాయి, “నేడే అనుకూలసమయం, నేడే రక్షణదినం!”

సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు.12:2)

మరణం తరువాత రెండు ప్రదేశాలలో ఏదో ఒక దానిలో ప్రతివ్యక్తీ తన నిత్యత్వాన్ని గడపాలి. జన్నత్ (جنت) మరియు జహన్నం (جهنم). జన్నత్ అన్నది పరదైసు, జహన్నం అన్నది నరకం. జన్నతులోకి ప్రవేశించడానికి మన స్వంత నీతి (స్వనీతి) సరిపోదు. అలాగే, స్వంత ప్రయత్నాలతోకూడిన మన మతనిష్ఠకూడా సరిపోదు. అందుకు సరిపోయింది కేవలం సృష్టికర్తే నరులకొరకై నిర్ధేశించిన నాలుగు ఆత్మీయ అడుగులు!

జన్నతులోనికి ప్రవేశించే అర్హతను సిద్ధపాటును అందించే ఆ నాలుగు అడుగులను గురించిన వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింకును నొక్కండి…

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మొదటి అడుగు…

[జన్నతులోనికి (మోక్షంలోకి) ప్రవేశించడానికి వేయాల్సిన నాలుగు (ఆత్మీయ) అడుగుల విశయములో మీకు సందేహాలున్నా లేక ఇంకా స్పష్టత కోరుతున్నా క్రింద ఉన్న కామెంటు బాక్సుద్వారా నైనా లేక మా Email ID <[email protected]> ద్వారానైనా మాకు వ్రాయండి.]

నాలుగవ అడుగు

నిజదేవుడు పంపిన లోకరక్షకుని ప్రబోధాలలో మాదిరిలో జీవించాలి [Live according to the teachings and life-examples of the Savour of the World sent by true God]

మానవాళికి యివ్వబడిన సంపూర్ణ దైవ ప్రత్యక్షతతోకూడింది బైబిలు గ్రంథం. తవ్’రాత్, జబూర్ వంటి దైవ గ్రంథాలతో కూడిన బైబిలులోని చివరి భాగం అల్-ఇంజీల్. మనుషులకు నిజదేవుని తరపున యివ్వబడిన చివరి గ్రంథం ఇంజీల్. ఈ గ్రంథములోనే జన్నతును చేరెందుకు మానవులు వేయాల్సిన నాలుగు అడుగుల వివరణ వుంది. ఇందులోనే మానవాళి రక్షణకై సృష్టికర్త చేసిన ప్రేమాత్యాగపు చరిత్ర లిఖించబడివుంది. ఆ దైవత్యాగపు ప్రత్యక్షతగా విచ్చేసిన లోకరక్షకుడు ఈసా అల్-మసీహ్ సాధించిన కార్యసాఫల్యం, ఆయన చేసిన బోధలు మరియు ఆయన చూపిన మాదిరి ఇంజీల్ మనకు అందిస్తున్నది.

జన్నతుకు (మోక్షం) వెళ్ళే అర్హతను సంపాదించే ప్రయత్నములో మొదటి మూడు అడుగులు చేసిన వ్యక్తులు ఆస్థితిలో ఈ లోకాన్ని వదిలితే వారు తిన్నగా జన్నతులోకి ప్రవేశిస్తారు. దీనికిగల కారణం వారు తమ స్వనీతిని ఆధారం చేసుకోక తమ స్వంతమతనిష్ఠపై ఆధారపడక లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ నందు దేవుడే చేసిన మోక్షకార్యంపై విశ్వాసముద్వారా ఆధారపడ్డారు.

అయితే, లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ ద్వారా నిజదేవుని ప్రజలుగా మారిన వ్యక్తులు ఈలోకములో ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఇతరులకు కూడా నాలుగు అడుగులలో ఉచితముగా పొందబోయే దేవుని కృపావరాన్ని గూర్చిన సమాచారాన్ని అందించాలి. అయితే, ఈరకంగా క్రొత్త జీవితములోకి ప్రవేశించిన వ్యక్తులు తిరిగి పాత జీవితవిధానానికి మరలకూడదు. క్రొత్త జీవితములో ఈసా అల్-మసీహ్ వారి బోఅధల ప్రకారం మరియు ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించాలి. ఇది మన స్వంత శక్తితో చేయలేనిది. దీనికి సృష్టికర్తే తన ఆత్మద్వారా ఆ శక్తిని మనకు అందిస్తాడు. ఇది ఆయన చేసిన వాగ్ధానం.

విశ్వాసముతో పశ్చత్తాప హృదయముతో క్షమాభిక్షను వేడుకుంటూ మొదటి మూడు అడుగులు వేసిన మనకు ఈసా అల్-మసీహ్ యొక్క పరిశుద్ధ రక్తములో మన పాపాలను కడిగి మనను పవిత్ర పరచి సృష్టికర్త మనకు పరమతండ్రిగా దగ్గరయ్యాడు. కేవలము ఈసా అల్-మసీహ్ కార్చిన వెలలేని పవిత్ర పరిశుద్ధ రక్తాన్నిబట్టే మన గత వర్తమాన మరియు భవిశ్యత్తు పాపాలను దేవుడు క్షమిస్తాడు. అయితే గమనించాలి, దేవుడు క్షమిస్తాడు గనుక పాపము చేద్దామని పథకరచనతో చేసే పాపాలనుబట్టి మనకు నిజమైన పశ్చత్తాపము కలుగదు గనుక అలాంటి పాపాలకు దేవుని క్షమాపణనుకూడా పొందలేము.

నాలుగవ అడుగుగా దేవుని కుటుంభములో చేరి దేవున్ని పరమతండ్రిగా పిలిచే ఆధిక్యతను పొందినవారు ఈలోకములో జీవించినంతకాలము లోకరక్షకుడైన ఇసా అల్-మసీహ్ చేసిన బోధల ప్రకారం అలాగే ఆయన చూపిన మాదిరిలో జీవించాలి. అంటే పొరుగువారిని ప్రేమించే, దూరస్థులను గౌరవించే, శత్రువులను దీవించే విధానములో ఎదగాలి. ఇది నిజదేవునికి ఇష్టమైన సేవ. ఈ జీవనవిధానములో కొనసాగుతున్నవారు చేసే ఆరాధనే నిజమైన ఆరాధన మరియు అది దేవునికి అంగీకారమైన ఆరాధన.

“మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.” (1యోహాను.2:3-4)

మూడవ అడుగు

నిజదేవుడు నిర్దేశించిన లోకరక్షకున్ని స్వీకరించాలి [Accept/Receive the Saviour of the World sent by true God]

సృష్టికర్తయైన దేవుడు తాను సృష్టించిన నరులను ప్రేమిస్తూ వారి ఉపదేశముకొరకు అనేకమంది ప్రవక్తలను నరులలోనుండి ఎన్నుకొని వారిద్వారా తన సందేశాలను మానవాళికి అందించాడు. ప్రవక్తల పరంపరద్వారా అందించబడిన సందేశాలలో తన చిత్తాన్ని తన ప్రణాలికను అలాగే తాను మానవాళి రక్షణకొరకు పంపబోవుతున్న లోకరక్షకుని గూర్చిన భవిశ్యవాణులను దేవుడు అందిస్తూ వచ్చాడు. దాదాపు 15 వందల సంవత్సరాల ఆ ప్రక్రియ చివరలో తాను సంకల్పించినవిధంగా తనలోని వాక్కును సశరీరునిగా ప్రతిష్టించి ఈలోకములోకి పంపించాడు.

దేవుని వాక్కు మనవాక్కులా ఒక వ్యక్తిత్వరహితమైన శబ్దం కాదు. నిజదేవునిలోని వాక్కు దైవత్వములోని వ్యక్తి! ఆ వ్యక్తి నరునిగా ఈలోకములో కన్యమరియకు జన్మించాడు. ఆయనే ఈసా అల్-మసీహ్! ఆయన ఈలోకములో ఒక నరునిగా, ప్రవక్తగా, అంతమాత్రమే కాకుండా అల్-మసీహ్ [ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు అభిషేకించబడినవాడు] గా జీవించి మానవాళి కొరకైన రక్షణ కార్యాన్ని నిర్వర్తించేందుకు దేవునిచేత పంపబడ్డాడు.

ఈసా అల్-మసీహ్ యొక్క జననం, జీవితం, శ్రమలు, మరణం మరియు మరణాన్ని జయించి తిరిగిలేవడంద్వారా నిజదేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరచే మానవులందరి పాపాలకు తగిన జరిమాన/శిక్షను చెల్లించాడు. ఇది మానవాళి యెడల సృష్టికర్త ప్రత్యక్షపరచిన దైవప్రేమ!

సాక్షాత్తు దైవప్రేమ యొక్క ప్రత్యక్షత అయిన ఈసా అల్-మసీహ్ ను మరియు ఆయనయందు దేవుడే నిర్వర్తించిన మోక్షకార్యాన్ని పాపియైన వ్యక్తి పశ్చత్తాపముతో విశ్వసించి స్వీకరించడమే దేవున్ని సంతృప్తిపరచి ప్రసన్నం చేసుకోవటం. ఇది ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగే అతిప్రాముఖ్యమైన ప్రార్థనా మరియు నిర్ణయం. అలాంటివారే దేవునిచేత క్షమించబడి ఆత్మలో క్రొత్తగా జన్మించి దేవుని ప్రజలుగా మారుతారు. మరణానంతరం వారు దేవుని సన్నిధిలో దేవదూతలనుపోలి మహిమతో నిత్యమూ జీవిస్తారు. ఇది నీకూ అందించాలన్నదే దేవుని సంకల్పం. విశ్వాసముతో స్వీకరించు!

“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1తిమోతి.2:5-6)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే నాలుగవ అడుగు…

రెండవ అడుగు

నిజదేవుడు సిద్ధపరచిన మోక్షమార్గాన్ని విశ్వసించాలి [Blieve in the Salvation prepared by true God]

సృష్టికర్తయైన దేవుడు సహజసిద్ధంగా పరిశుద్ధుడు, న్యాయవంతుడు, మరియు ప్రేమాస్వరూపి. మానవకోటి అంతా తమ కార్యాలద్వారా, మాటలద్వారా, అంతేగాక తలంపులు/ఉద్దేశాలద్వారాకూడా దేవునికి వ్యతిరేకంగా పాపముచేసినవారే. అత్యంత పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎంత చిన్న పాపమైనా పెద్ద సమస్యే. మన పాపము (అంటే దేవునికి వ్యతిరిక్తమైనది) మనను పరిశుద్ధుడైన దేవునినుండి వేరుపరచింది. దేవుని న్యాయం మనపాపాలకు తగిన జరిమాన లేక శిక్షను నిర్ణయించింది. అది పరిశుద్దుడైన దేవునికి దూరంగా నరకాగ్నిలో నాశనమవడం.

లోకములో పాపరహితుడెవరూ లేరుగనుక అందరు నరకములో నాశనాన్ని శిక్షగా పొందబోతున్నారు. అయితే సృష్టికర్తయైన దేవుడు ప్రేమాస్వరూపి. ఈ కారణముచేత ఆయన అందరిని ప్రేమిస్తూ ఎవరు అంటే ఏపాపికూడా నరకములోకి ప్రవేశించడాన్ని ఇచ్చయించడు. అందునుబట్టి దేవుని ప్రేమ మానవులు తమ పాపాలకు పొందబోయే నరకశిక్షకు పరిష్కారాన్ని కనుగొని మానవులు ఆశిక్షలోనుండి తప్పించుకునే పరిష్కారమార్గాన్ని సిద్దపరచింది. ఇందుకుగాను దేవుడు తన న్యాయాన్ని సంతృప్తిపరుస్తూనే తన ప్రేమను ఋజువుపరచాడు. ఇందులో దేవుని న్యాయం, ప్రేమ, మరియు జ్ఙానం ద్యోతకమవుతున్నాయి.

దేవుడు సర్వశక్తిమంతుడు మరియు సార్వభౌముడు. దీని భావం ఆయన తన స్వభావానికి గుణలక్షణాలకుకూడా వ్యతిరేకంగా ప్రవర్తించగలడని కాదు. ఒక వేళ దేవుడు తన ప్రేమను బట్టి పాపులందరికి ఏజరిమానా లేక శిక్ష విధించకుండా ఒక్క మాటతో వారిని క్షమిస్తే తద్వారా ఆయన తన స్వభావలక్షణమైన న్యాయం/నీతికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. కనుక ఆయన అలా చేయడు చేయనేరడు. అలాచేయడమన్నది నిజదేవుని స్వభావానికే విరుద్ధమైనది.

మానవులందరి పాపాలకు దేవుని న్యాయం తగిన జరిమానను/శిక్షను నిర్దేశించించింది. దాని వెల ఊహలకందనిది. ఏ ఒక్క నరుడుగాని లేక నరుల సమూహముగాని ఆ వెలను తీర్చజాలదు. అందుకే దేవుడే ఊహాతీతమైన ఆ జరిమానను తన అపారమైన ప్రేమను బట్టి తానే భరించి దాని వెలను తాను చెల్లించాడు. ఈ విధానంలో నిజదేవుడు మానవాళికి పాపక్షమాపణను అందిస్తూ మోక్షమార్గాన్ని సిద్ధపరచాడు.

దేవుడే సిద్ధపరచిన మోక్షమార్గపు నెరవేర్పులో నరుల ప్రయత్నాలుగాని లేక పాలుపంపులుగాని లేవు. ఇది కేవలం దేవుని కార్యం. ఏనరుడు తన స్వనీతినిబట్టి లేక తన స్వంత మతనిష్టనుబట్టి పాపక్షమాపణను మోక్షాన్ని పొందజాలడు. అది దేవుని ఉచిత కృపావరము. కనుకనే ఏనరునికీ ఇందులో అతిశయించే ఆస్కారము లేదు!

దేవుడే తన నిత్య సంకల్పములో పథకరచన చేసి నిర్వర్తించి సిద్ధపరచిన క్షమాపణా పథకాన్ని విశ్వసించక దాన్ని తిరస్కరించిన వ్యక్తులందరు దేవుని క్షమాపణను అందుకోలేరు. అలాంటివారందరు తమ పాపాలన్నింటికి దేవుని న్యాబద్ధమైన జరిమాన/శిక్ష అన్నది రాబోవు తీర్పుదినాన నరకశిక్షద్వారా అందుకోబోతున్నారు. ప్రవక్త అయిన మూసా (మోషే) మరియు యితర ప్రవక్తల ద్వారా యివ్వబడిన దేవుని లేఖనాలలోని ధర్మం సూచిస్తున్న ప్రకారం ఒక వ్యక్తి తన తోటి నరునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు లేక అన్యాయాలకు రెండంతలు చెల్లించాలి (నిర్గ.కాం.22:4,7,9; యెషయా.40:2, 51:19; యిర్మీయ.16:18). అయితే, ఒక వ్యక్తి సృష్టికర్తకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు/అన్యాయాలకు ఎన్ని రెట్లు చెల్లించాలో నన్నది ఊహకు అందనిది. కనుకనే ప్రవక్త అయిన దావూద్ (దావీదు) ద్వారా యివ్వబడిన దైవలేఖనాలలోని వివరణ ప్రకారం అది ఎన్నటికీ తీరనిది (కీర్తన.49:9).

“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.” (రోమా.5:8-9)

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే మూడవ అడుగు…

మొదటి అడుగు

మొదటి అడుగు

నిజమైన అద్వితీయదేవున్ని విశ్వసించాలి [Blieve in the One true God]

సృష్టికర్త అయిన నిజదేవుడు సృష్టికి అతీతమైనవాడు మరియు సృష్టికి వేరైనవాడు. దేవుడు (אֱלֹהִ֑ים/Θεὸς/الله‎/God/) అన్న పదం అన్ని సమయాలలో సృష్టికర్తనే సూచించనవసరం లేదు. ఆ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి లేక గ్రంథము యొక్క దృష్టిపథంలో వున్న భావం మరియు గ్రహింపులే ఆ సందర్భములో ఆపదం సూచిస్తున్నదాన్ని నిర్వచించగలవు.     

‘ఏకైక దేవుడు’ అని పేర్కొన్నప్పటికి అది నిజదేవున్ని గురించి చెప్పబడిన మాట కానవసరము లేదు. ఏకదేవుడు/ఏకైకదేవుడు/ఒకేదేవుడు/ఒక్కదేవుడు వంటి పదజాలము అబద్ద దేవునికి లేక లేనిదేవునికి అంటే కేవలము మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమైన దేవునికి కూడా వాడబడుతున్నాయి ఈనాటి ధార్మిక ప్రయత్నాలలో. ఈ అత్యంత ప్రమాదకరమైన కారణాన్నిబట్టి నిజమైన అద్వితీయదేవున్ని మాత్రమే గుర్తించి విశ్వసించగలగాలి.          

నిజదేవుడు నిత్యుడు (Eternal), అనంతుడు (Infinite), స్వయంభవుడు (Self-Existent) మరియు అద్వితీయుడు (One). ఇవి దేవుని యొక్క తాత్విక గుణలక్షణాలుగా (Philosophical Attributes) చెప్పుకోవచ్చు. ఈ గుణలక్షణాలలో ఏది కొదవైనా అలాంటి దేవుడు నిజదేవుడు కాదు అన్నది సుస్పష్టం!  

పరిపూర్ణమైన పరిశుద్ధత (Holiness), న్యాయం/నీతి (Justice/Righteousness), మరియు ప్రేమ (Love) అన్నవి నిజదేవునికి వున్న నైతిక గుణలక్షణాలు (Moral Attributes). ఇందులో ఏగుణలక్షణం లేని దేవుడైనా అబద్ధ దేవుడైనా అయివుండాలి లేక మాటలకు ఊహలకు మాత్రమే పరిమితమయిన దేవుడైనా అయివుండాలి.              

చివరగా, సర్వశక్తిమంతుడు (Omnipotent), సర్వజ్ఙాని (Omniscient), మరియు సర్వవ్యాప్తి (Omnipresent) అన్నవి నిజదేవుని సహజ గుణలక్షణాలు (Natural Attributes) అన్నది మరువకూడదు. ఈ గుణలక్షణాలులేని దేవున్ని పరిచయం చేసే ఏధార్మిక మార్గమైనా అసత్యమార్గమని ఇట్టే గుర్తించవచ్చు.

అనంతుడైన దేవుడు సర్వవ్యాప్తిగా వుండటం తధ్యం, అది అనిర్వార్యం. అలా సర్వవ్యాప్తిగా వుండలేని దేవుడు పరిధులుగల దేవుడు గనుక అలాంటి దేవుడు అనంతుడు కాదు, మరిముఖ్యంగా నిజదేవుడు కానేకాదు. నిజదేవుడు సర్వవ్యాప్తిమంతుడై వున్నా ఆయన సృష్టిని తగలకుండా సృష్టితో ఎలాంటి అనుసంధానము లేకుండా వున్నవాడు. అందుకే సృష్టికర్త ‘నేను ఉన్నవాడను’ అనువాడనై వున్నాను అంటూ తన ప్రవక్తకు తన నామమును వెల్లడిపరిచాడు. నిజదేవుడు వ్యాపించని స్థలము విశ్వములో ఎక్కడా లేదు. ఉనికిలోకి వచ్చిన ఈ విశ్వమంతా ఆయనలో సృష్టించబడింది. ఆయనకు బయట లేక వేరుగా వుండే స్థలమంటూ ఏదీ లేదు. ఆయనలో ఆయననుబట్టి ఉనికిని కలిగివున్నా అది ఆయనలోని భాగం కాదు కానేరదు. స్వయంభౌమత్వం అన్నది సృష్టికర్తకు మాత్రమే చెందిన ప్రవృత్తి. అది సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్యనున్న ఎప్పటికి తొలగని అగాధం! 

సృష్టికర్త అయిన దేవుడు తాను ఆశించిన రీతిలో తాను నిర్ధారించిన కాలములో సృష్టికి తనను తాను ప్రత్యక్షపరచుకోగల శక్తిసామర్థ్యమున్నవాడు. తన సంపూర్ణ మహిమాప్రభావాలతో కాకుండా సృష్టి వీక్షించగల స్థాయిలో తన ప్రత్యక్షతను అనుగ్రహించటమన్నది కేవలం నిజదేవునికే సుసాధ్యం. కాని, ఊహలకు మాత్రమే పరిమితమైన అబద్ద దేవునికి ఇది అసాధ్యం!

నిజదేవున్ని గుర్తించి విశ్వసించటమన్నది సరియైన దిశలో వేసే మొదటి అడుగు.

“…ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.” (మార్కు.12:29)

“దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.” (యాకోబు.2:19)

[పరిశుద్ధుడు: పవిత్రత, పరిపూర్ణత, మరియు ప్రత్యేకతల సమ్మేళణము కలిగినవాడు;
నిత్యుడు: ఆది అంతము లేనివాడు;
అనంతుడు: అపరిమితుడు; హద్దులు/పరిధులు లేనివాడు;
అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;]

గమనిక: దేవుడు (الله/God) అని సంబోధిస్తున్నా ఒకవేళ అది నిజదేవున్ని గురించి కాకపోతే ఆ సంబోధన అబద్ద దేవునికేనన్నది విస్పష్టం. అబద్ద దేవుడు రెండు రకాలుగా వుండే అవకాశముంది:

(అ) సృష్టించబడినదేదైనా లేక ఎవరైనా దేవునిగా సంబోధించబడితే అది అబద్ద దేవుడుగా లెక్కించబడుతుంది/లెక్కించబడుతాడు.
(ఆ) లేనిదేవుడు అంటే కేవళము మనుషుల ఊహలకే మాత్రమే పరిమితమైన దేవుడు కూడా అబద్ద దేవుడుగానే లెక్కించబడుతాడు.

జన్నతుకు (మోక్షానికి) వెళ్ళేందుకు వేసే రెండవ అడుగు…