నాలుగవ అడుగు

నిజదేవుడు పంపిన లోకరక్షకుని ప్రబోధాలలో మాదిరిలో జీవించాలి [Live according to the teachings and life-examples of the Savour of the World sent by true God]

మానవాళికి యివ్వబడిన సంపూర్ణ దైవ ప్రత్యక్షతతోకూడింది బైబిలు గ్రంథం. తవ్’రాత్, జబూర్ వంటి దైవ గ్రంథాలతో కూడిన బైబిలులోని చివరి భాగం అల్-ఇంజీల్. మనుషులకు నిజదేవుని తరపున యివ్వబడిన చివరి గ్రంథం ఇంజీల్. ఈ గ్రంథములోనే జన్నతును చేరెందుకు మానవులు వేయాల్సిన నాలుగు అడుగుల వివరణ వుంది. ఇందులోనే మానవాళి రక్షణకై సృష్టికర్త చేసిన ప్రేమాత్యాగపు చరిత్ర లిఖించబడివుంది. ఆ దైవత్యాగపు ప్రత్యక్షతగా విచ్చేసిన లోకరక్షకుడు ఈసా అల్-మసీహ్ సాధించిన కార్యసాఫల్యం, ఆయన చేసిన బోధలు మరియు ఆయన చూపిన మాదిరి ఇంజీల్ మనకు అందిస్తున్నది.

జన్నతుకు (మోక్షం) వెళ్ళే అర్హతను సంపాదించే ప్రయత్నములో మొదటి మూడు అడుగులు చేసిన వ్యక్తులు ఆస్థితిలో ఈ లోకాన్ని వదిలితే వారు తిన్నగా జన్నతులోకి ప్రవేశిస్తారు. దీనికిగల కారణం వారు తమ స్వనీతిని ఆధారం చేసుకోక తమ స్వంతమతనిష్ఠపై ఆధారపడక లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ నందు దేవుడే చేసిన మోక్షకార్యంపై విశ్వాసముద్వారా ఆధారపడ్డారు.

అయితే, లోకరక్షకుడైన ఈసా అల్-మసీహ్ ద్వారా నిజదేవుని ప్రజలుగా మారిన వ్యక్తులు ఈలోకములో ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఇతరులకు కూడా నాలుగు అడుగులలో ఉచితముగా పొందబోయే దేవుని కృపావరాన్ని గూర్చిన సమాచారాన్ని అందించాలి. అయితే, ఈరకంగా క్రొత్త జీవితములోకి ప్రవేశించిన వ్యక్తులు తిరిగి పాత జీవితవిధానానికి మరలకూడదు. క్రొత్త జీవితములో ఈసా అల్-మసీహ్ వారి బోఅధల ప్రకారం మరియు ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించాలి. ఇది మన స్వంత శక్తితో చేయలేనిది. దీనికి సృష్టికర్తే తన ఆత్మద్వారా ఆ శక్తిని మనకు అందిస్తాడు. ఇది ఆయన చేసిన వాగ్ధానం.

విశ్వాసముతో పశ్చత్తాప హృదయముతో క్షమాభిక్షను వేడుకుంటూ మొదటి మూడు అడుగులు వేసిన మనకు ఈసా అల్-మసీహ్ యొక్క పరిశుద్ధ రక్తములో మన పాపాలను కడిగి మనను పవిత్ర పరచి సృష్టికర్త మనకు పరమతండ్రిగా దగ్గరయ్యాడు. కేవలము ఈసా అల్-మసీహ్ కార్చిన వెలలేని పవిత్ర పరిశుద్ధ రక్తాన్నిబట్టే మన గత వర్తమాన మరియు భవిశ్యత్తు పాపాలను దేవుడు క్షమిస్తాడు. అయితే గమనించాలి, దేవుడు క్షమిస్తాడు గనుక పాపము చేద్దామని పథకరచనతో చేసే పాపాలనుబట్టి మనకు నిజమైన పశ్చత్తాపము కలుగదు గనుక అలాంటి పాపాలకు దేవుని క్షమాపణనుకూడా పొందలేము.

నాలుగవ అడుగుగా దేవుని కుటుంభములో చేరి దేవున్ని పరమతండ్రిగా పిలిచే ఆధిక్యతను పొందినవారు ఈలోకములో జీవించినంతకాలము లోకరక్షకుడైన ఇసా అల్-మసీహ్ చేసిన బోధల ప్రకారం అలాగే ఆయన చూపిన మాదిరిలో జీవించాలి. అంటే పొరుగువారిని ప్రేమించే, దూరస్థులను గౌరవించే, శత్రువులను దీవించే విధానములో ఎదగాలి. ఇది నిజదేవునికి ఇష్టమైన సేవ. ఈ జీవనవిధానములో కొనసాగుతున్నవారు చేసే ఆరాధనే నిజమైన ఆరాధన మరియు అది దేవునికి అంగీకారమైన ఆరాధన.

“మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.” (1యోహాను.2:3-4)