సంపూర్ణ దైవగ్రంథము

ధార్మిక గ్రంథాలు మరియు మతధర్మాలు

ఒకే ఒకవ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తెచ్చి ఒక మతధర్మాన్ని స్థాపించిన వైనాలు చరిత్రలో కోకొల్లలు. ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలకు ప్రేరణలుకూడా యెన్నో. తమచుట్టూ వున్న సాంఘీక దురాచారాలను సంస్కరించాలనే తపన ఒక కారణంకాగా తమ స్వలాభంతో పబ్భం గడుపుకోవాలనుకునే స్వార్థం మరో కారణం. ఈ రెండూ కారణాల సమ్మేళనంకూడా యింకో కారణం కావచ్చు. ఈ వాస్తవికతనుబట్టి ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాల చిత్తశుద్ధిని నిర్ధారించడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు.    

ఏకవ్యక్తి స్థాపిత మతధర్మాలలో ప్రధానమైనవి జొరాస్టీయ మతం, బవుద్ధ మతం,  ఇస్లాం మతం, మార్మను మతం, బహాయి మతం, అహ్మదీయ మతం మొదలగునవి. వీటిలో సగానికి పైగా మతాలు యితర మతధర్మాలను వుటంకిస్తూ వాటి బోధనలను ఒకవైపు తమకు ప్రామాణికమని చెప్పుకొంటూనే మరొకవైపు ఆమతధర్మాలకు చెందిన గ్రంథాలను తప్పుబడుతూ వాటిపై తమ ఆధిపత్యాని స్థాపించుకునే  కుసంస్కృతికి ఒడిగడుతూ తమ దివాళుకోరుతనాన్ని చాటుకుంటున్నాయి.  

ఒక వ్యక్తి ఒక ధార్మిక గ్రంథాన్ని తీసుకువచ్చి తనను తాను ఒక దైవప్రవక్తగా లేక దైవసందేశకునిగా లేక దైవప్రత్యక్షతగా లేక దైవఅవతారముగా ప్రకటించుకొంటూ దానికి సాక్ష్యంగా తానే తెచ్చిన గ్రంథాపు బోధలను చూపించడమన్నది అతర్కం, కుతర్కం, మరియు మోసం! ఈలాంటి పంథా లేక ప్రయత్నం ప్రధానంగా ఏకవ్యక్తి స్థాపిత మతాలలో ప్రస్పుటంగా కనిపిస్తుంది.

కొన్ని ఏకవ్యక్తి స్థాపిత మత గ్రంథాలలో యితర ధార్మిక గ్రంథాలను పేర్కొనడమే కాకుండా యితర ధార్మిక ప్రవక్తలను లేక ధార్మిక నాయకులను ప్రస్తావిస్తూ వారంతా తమ ధార్మిక మార్గానికే చెందినవారంటూ నమ్మించే ప్రయత్నాలను చూడగలము. ఇది మోసపూరితమైన వితండవాదం అన్నది ఇంగితజ్ఞానం ఉన్న యెవరికైన యిట్టే అర్థమైపోతుంది. 

నిజమైన దైవ గ్రంథము

తవ్రాత్, జబూర్, ప్రవక్తలు, మరియు ఇంజీల్ గంథాల సమిష్టి స్వరూపమే బైబిలు గ్రంథము. ఈ గ్రంథము యొక్క బోధనలే ప్రామాణికంగా వున్న క్రైస్తవ ధార్మికమార్గం యితర మతధర్మాలకు పూర్తిగా భిన్నమైనది. ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని విశిష్టతలే అందుకు సాక్ష్యం:

1) బైబిలు బోధల అధారితమైన క్రైస్తవ్యం ఏకవ్యక్తి స్థాపిత మతం కాదు. నిజానికి అది అనేకమంది దైవప్రవక్తలు మరియు అపోస్తలుల సమిష్టి బోధనలపై స్థిరపడి విరాజిల్లుతున్న దైవరాజ్యం. 

2) బైబిలు గ్రంథం దాదాపు నలభైమంది దైవప్రేరితులద్వార మానవాళికి అందించబడిన గ్రంథం. ఒకే సంస్కృతికి చెంది ప్రామాణీకరించబడిన ప్రవక్తల పరంపరలోనుండి అందించబడిన  సాటిలేని మేటి గ్రంథం బైబిలు.
           
3) బైబిలు గ్రంథం ఒకేభాషలో కాకుండా మూడు ప్రాచీన భాషలలో (హీబ్రూ, అరామిక్, గ్రీక్) అందించబడింది.   

4) బైబిలు గ్రంథం ఒకతరములోనే యివ్వబడిన గ్రంథం కాదు. పదునైదువందల సంవత్సరాల పరిధిలో (1400 క్రీ.పూ. — 95 క్రీ.శ.) సుధీర్ఘకాల ప్రత్యక్షతలో ఇవ్వబడిన గ్రంథరాజం బైబిలు.  

5) బైబిలు గ్రంథం ఒక పరిమితమైన భౌగోళిక స్థలంలో అందించబడిందికూడా కాదు. మూడు ఖండాలలో (ఆసియా, ఐరోపా, అఫ్రికా) అందించబడిన ఏకైక దైవ గ్రంథం.    
       
6) నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు, నీశత్రువునుకూడా ప్రేమించి దీవించు మరియు సృష్టికర్త యెదుట స్త్రీపురుషుల గుర్తింపు, విలువ, మోక్షంలోని స్థానం ఏకరీతిగానే ఉంటాయన్న ఉత్కృష్ట విలువలను మానవాళికి అందించిన ఏకైక ధార్మిక గ్రంథం బైబిలు.

7) లేఖికుల మధ్య, లిఖించబడిన భాషలలో, వ్రాయబడిన స్థలాలలో, అందించబడిన తరాలలో అనూహ్యమైన వైవిధ్యమున్నా సృష్టికర్తనుగూర్చిన ప్రత్యక్షతను, మానవాళి ప్రవృత్తిని, మోక్షాన్ని గూర్చిన వివరాలను అందించడంలో అబ్బురపరచే పొందికను ఐక్యతను పొందుపరచుకున్న అద్భుత గ్రంథం బైబిలు. 

దైవ గ్రంథ వివరణ

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు [తవ్రాత్, జబూర్, ప్రవక్తలు, మరియు ఇంజీల్] యూదు మరియు క్రైస్తవ లేఖనాల సంపుటి. అందులోని మొదటి 39 యూదు లేఖన గ్రంథాలను పాత నిబంధన గ్రంథము అని ఆ తరువాతి 27 క్రైస్తవ లేఖన గ్రంథాలను క్రొత్త నిబంధన గ్రంథము అని పేర్కొంటారు. ఈ రెండు విభాగాలను సమిష్టిగా ‘బైబిలు’ అని పెర్కొంటారు.  

ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రధాన క్రైస్తవ శాఖలన్నీకూడా ఈ 66 (39+27) హీబ్రూ, అరామిక్, మరియు గ్రీకు భషా లేఖనాల సంపుటిని బైబిలుగా గుర్తిస్తారు. అయితే, కొన్ని క్రైస్తవ శాఖలు మాత్రం ఈ 66 అసలైన లేఖనగ్రంథాల సరసన మరికొన్ని చారిత్రక లేక పురాణాలకు సంబంధించిన గ్రంథాలనుకూడా కలుపుకొని వాటన్నిటిని కలిపి దైవగ్రంథముగా పరిగణిస్తూ చదువుకొంటుంటారు.    

హీబ్రూ మరియు అరామిక్ భాషలలో యివ్వబడిన లేఖనాలను పాతనిబంధన గ్రంథమని గ్రీకు భాషలో యివ్వబడిన లేఖనాలను క్రొత్తనిబంధన గ్రంథమని సర్వసాధారణముగా పేర్కొంటారు. పాత మరియు క్రొత్త నిబంధనా గ్రంథాలు యివ్వబడిన రెండు కాలాలకు మధ్య దాదాపు నాలుగు వందల సంవత్సరాల వ్యవధిలో యూదు రచయితలు తమ మతవిశ్వాసాలపై అనేక గ్రంథాలను రచించడం జరిగింది. వీటినే అపోక్రిఫ గ్రంథాలు అని పేర్కొంటారు. ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన గ్రంథాలు కావు, కనుక యివి లేఖనాలు కావు. ఈ గ్రంథాలను యూదులుకూడా లేఖనాలుగా పరిగణించరు.

అయితే, ప్రధానంగా రెండు క్రైస్తవ శాఖలు (రోమను కథోలిక్కులు మరియు గ్రీకు అర్థోడాక్సులు) ఈ యూదుల అపోక్రిఫ గ్రంథాలలోని కొన్నిటిని 66 అసలైన దైవలేఖన గ్రంథాల సరసన కలుపుకొని చదువుకుంటారు. రోమను కథోలిక్కులు 13 అపోక్రిఫ గ్రంథాలను కలుపుకోగా గ్రీకు అర్థోడాక్సులు 17 అపోక్రిఫ గ్రంథాలను కలుపుకున్నారు. అయితే యిక్కడ గమనంలో వుంచుకోవలసిన విశయం ఈ రెండు క్రైస్తవ శాఖలలోకూడా అసలైన 66 దైవలేఖన గ్రంథాల విషయంలో మాత్రం యెలాంటి అభిప్రాయ భేదాలు లేవు అన్నది.

ఏదైన ఒక క్రైస్తవశాఖ లేక గుంపు బైబిలుకు వేరే గ్రంథాన్ని లేక గ్రంథాలను కలుపుకున్నంతమాత్రాన బైబిలే మారిపోయిందనో లేక అసలైన బైబిలును గుర్తించడం అసాధ్యమనో వాదించడం శుద్ధ అవివేకం. అలాంటి వ్యాఖ్యానాలను సాధారణంగా విశయపరిజ్ఙానం లేని మూఢులేకాకుండా తర్కబద్ధంగా అలోచించగల సామర్థ్యంలేని అధములైనవారే చేస్తుంటారు అన్నది గమనములో ఉంచుకోవాలి.  

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులోని యూదులేఖనాలు లేక పాతనిబంధన గ్రంథాలు (39) మూలభాషలైన ఆదిమ హీబ్రూ మరియు అరామిక్ భాషలలో లిఖించబడివుండగా క్రైస్తవ లేఖనాలు లేక క్రొత్తనిబంధన గ్రంథాలు (27) కొయినె గ్రీకు భాషలో లిఖించబడ్దాయి. 

సృష్టికర్త యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి ఆయన మానవాళికొసగిన తన లేఖనాల సంపుటియైన పరిశుద్ధ గ్రంథము (బైబిలు) ను 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా వున్న 670 భాషలలోకి అనువదించబడింది. కేవలము క్రొత్త నిబంధన గ్రంథము (క్రైస్తవ లేఖనాలు) ప్రపంచములోని 1521 భాషలలోకి అనువదించబడింది. మానవాళికి ఇంత విస్తృతంగా అందుబాటులో ఉన్న ఏకైక గ్రంథం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు [తవ్రాత్, జబూర్, ప్రవక్తలు, మరియు ఇంజీల్]. 

బైబిలు భావామృతం

బైబిలు అనువాదాలు మూలభాషలలో యివ్వబడిన లేఖనాల సాధారణ భావం మరియు సందేశ సారాంశాన్ని మాత్రం అందిస్తాయి అన్నది గమనంలో ఉంచుకోవాలి. బైబిలులోని ఒక అంశం లేక పదం యొక్క ఖచ్చితమైన భావాన్ని గ్రహించేందుకు మూలభాషలలో బైబిలును అధ్యయనం చేయడం తప్పనిసరి అన్నది కూడ గుర్తించాలి. 

బైబిలులో భూతవర్తమానభవిశ్యత్ కాలాలకు సంబంధించిన వివరాలు యివ్వబడ్డాయి. చరిత్ర ఘట్టాల సమాచారాలతో పాటు దైవప్రబోధాల వివరాలుకూడా బైబిలులో సందేశాలుగా అందించబడ్డాయి. బైబిలులోని ప్రబోధాలు కొన్ని అక్షరార్థముగా, కొన్ని అలంకారార్థముగా, మరికొన్ని మర్మఘర్భితంగా యివ్వబడ్డాయి. బైబిలు సందేశాలను సరిగ్గా అవగాహనచేసుకోవటానికి సందేశము యొక్క నేపథ్యాన్ని, కాలసందర్భాన్ని, సాంస్కృతిక వాతావరణాన్ని, సాహిత్య శైలులను పరిగణాలోకి తీసుకోవాలి. ఈ సందర్భంగా ప్రపంచభాషలలోకి అనువదించబడిన బైబిలు యొక్క అనువాదాల విశయములో గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు:

1) లేఖనాల అనువాదాలన్నవి ఏభాషలోకూడా నూటికి నూరుశాతం పరిపూర్ణత కలిగి ఉండవు.
2) లేఖనాలు దైవాత్మచేత ప్రేరేపించబడినవారిచేత వ్రాయబడ్డాయి. అలాగే, లేఖనాలను ఒక భాషలోనుండి మరొక భాసలోనికి దైవాత్మచేత ప్రేరేపించబడినవారు అనువదించిన సందర్భాలలోనే వాటి అనువాదం నూటికి నూరుశాతం పరిపూర్ణతన కలిగి ఉంటాయి. 
3) అనువాదాలను పట్టుకొని మూలభాషలోని అర్థాన్ని నిర్ధారించడం తర్కవిరుద్ధం. 
4) మూలభాషలోని అర్థాన్నిబట్టి అనువాదాలలోని అర్థాన్ని గ్రహించగలగాలి అవసరమైతే అనువాదాన్ని సరిచేసుకోవాలి. 
5) పాతనిబంధన (యూదు లేఖనాలు) లోని వాక్యాలకు క్రొత్తనిబంధన (క్రైస్తవ లేఖనాలు) లో యివ్వబడ్డ వివరణలు మరియు భాష్యాలు మాత్రమే నూటికి నూరుశాతం సరియైనవి.

బైబిలులోని సత్యాలను అందరూ గ్రహించలేకపోవడానికిగల కారణాలు

1) కొందరు బైబిలును అసలు చదవకుండానే లేక ఆసాంతము చదవకుండానే లేక దాన్ని చదవాల్సినవిధంగా చదవకుండానే యెవరో చెప్పిన మాటలు విని వాటిని నమ్మి బైబిలుగురించి తప్పుడు అవగాహనను యేర్పరచుకొని ఆ అజ్ఙానములో కొనసాగుతుంటారు. ఆ విధానము వారిని నాశనమార్గము వైపుకు నడుపుతుంది. అలాంటివారికి దైవసత్యం యెప్పటికీ అందదు. (మత్తయి 22:29)

2) కొందరు అబద్దికులును మరియు మోసగాండ్రులై యుండి యితరులను దురాత్మల బోధలలోనికి తీసుకొనివెళ్ళే ప్రయత్నంలో భాగంగా బైబిలులో తప్పులు వెదికేందుకే దాన్ని పఠిస్తారు. అలాంటివారికి అందులోని సత్యం ససేమిరా అవగతం కాదు. (1తిమోతి 4:1-2)

3) కొందరు తమ మూర్ఖత్వాన్నిబట్టి మోసపోయిన కారణంగా వారి మనోనేత్రాలకు సాతానుడు అంధకారం కలుగజేశాడు. అలాంటివారికి బైబిలులోని సత్యాన్ని వీక్షించడము అన్నది అసాధ్యమైన విశయం. (2 కొరింథీ 4:4)

4) కొందరు అహంకారంతో దైవసత్యాన్ని తిరస్కరించి అవిధేయతతో స్వనీతిపై ఆధారపడుతూ తమ స్వంత ప్రయత్నాలతో ముక్తిని సంపాదించుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. అలాంటివారి హృదయాలను సృష్టికర్తే కఠిన పరచడం జరుగుతుంది. కనుక అలాంటివారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే కొనసాగుతుంటారు (కీర్తనలు 81:11-12; యెషయా 6:9-10; మత్తయి 13:13-15; 2 థెస్సలోనీకయులకు 2:9-12). అలాంటివారికికూడా బైబిలులోని దైవసత్యం సుదూరం.

5) చివరగా, కొందరికి అజ్ఙనాన్నిబట్టి అలాగే మందమతినిబట్టి హృదయాలు మూయబడివుంటాయి. ఈ కారణాన్నిబట్టికూడ లేఖనసత్యాన్ని గ్రహించలేరు. అయితే అలంటివారు యదార్థ హృదయాలతో దేవున్ని ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేశిస్తున్నట్లయితే వారు లేఖనాలలోని దైవసత్యాన్ని గ్రహించేందుకు వీలుగా వారి హృదయాలను దేవుడే తెరవడం జరుగుతుంది (లూకా 24:25-32, 45).

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు యొక్క తెలుగు అనువాదపు లింకు:

https://www.bible.com/bible/1787/GEN.1.TELOV-BSI